భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తోంది. అయితే, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలన్నా ప్రభుత్వ ఖజానాకు పటిష్టమైన ఆదాయ వనరులు ఉండాలి.
ప్రస్తుతం అమలులో ఉన్న సంప్రదాయ పన్ను వసూలు విధానాల్లో ఉన్న లోపాలను సవరించి, ‘ప్రతి ఇంటికి ఒక డిజిటల్ గుర్తింపు’ అనే వినూత్న విధానాన్ని అమలులోకి తేవడం ద్వారా తెలంగాణ మరో మైలురాయిని అధిగమించవచ్చు. డిజిటల్ ఇంటి నంబర్ & జియో-ట్యాగింగ్.. ప్రతి ఇంటికి లేదా ఖాళీ స్థలానికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్, బార్‌కోడ్ కేటాయించడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశ్యం.
డిజిటల్ ఆధార్: మనిషికి ఆధార్ కార్డు ఎలాగో ఆస్తికి ఈ క్యూఆర్ కోడ్ అలా పనిచేస్తుంది.
జియో ట్యాగింగ్: శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఇంటి అక్షాంశ, రేఖాంశాలను నమోదు చేయడం వల్ల ఆస్తి కచ్చితమైన ఉనికిని లైవ్‌లో ట్రాక్ చేయవచ్చు.
స్మార్ట్ నంబర్ ప్లేట్లు: ప్రతి ఇంటి ముఖద్వారం వద్ద ఈ కోడ్‌లతో కూడిన ప్లేట్లను అమర్చడం ద్వారా అధికారులు స్కాన్ చేసిన వెంటనే ఆస్తి వివరాలు తెలుస్తాయి.
అంతస్తుల వారీగా ఆస్తి విభజన
ప్రస్తుతం ఒక ఇల్లు అంటే ఒకే అసెస్‌మెంట్ నంబర్ ఉంటుంది. కానీ, ఈ కొత్త విధానంలో ‘ఫ్లోర్-వైజ్ ఐడెంటిటీ’ (అంతస్తులవారీ గుర్తింపు) అమలు చేయవచ్చు. సులభతర బదిలీ చేయవచ్చు. యజమాని తన ఇంటిలోని ఒక అంతస్తును అమ్మినప్పుడు, కేవలం ఆ అంతస్తుకు సంబంధించిన బార్‌కోడ్, ఐడెంటిటీ మాత్రమే కొత్త కొనుగోలుదారు పేరుమీదకు మారుతుంది. దీనివల్ల మొత్తం డాక్యుమెంట్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ సులభతరం అవుతుంది. 'ఫ్లోర్' ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ జరగడం వల్ల పన్ను ఎగవేతకు అడ్డుకట్ట పడుతుంది.
ఈ విధానంతో కుటుంబ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఆస్తి పంపిణీలో అన్నదమ్ముల మధ్య వచ్చే తగాదాలను ఈ డిజిటల్ వ్యవస్థ సమూలంగా నివారిస్తుంది. వ్యక్తిగత స్వయంప్రతిపత్తి కలుగుతుంది. ఉదాహరణకు ఒక జీ+2 భవనంలో ముగ్గురు కుమారులు ఉంటే, ఎవరికి కేటాయించిన ఫ్లోర్ వారి పేరు మీద డిజిటల్ రికార్డుల్లో నమోదవుతుంది. పన్ను చెల్లింపు బాధ్యతాయుతంగా మారుతుంది.
ఎవరి అంతస్తుకు సంబంధించిన మున్సిపల్ పన్ను వారే చెల్లిస్తారు. ఒకరు పన్ను కట్టకపోయినా, కేవలం ఆ నిర్దిష్ట ఫ్లోర్‌కు మాత్రమే నోటీసులు అందుతాయి, మిగిలిన సోదరులపై ఆ ప్రభావం ఉండదు. స్వతంత్ర లావాదేవీలకు మార్గం సుగమం అవుతుంది. ఒకరు తన వాటాని అద్దెకు ఇచ్చుకున్నా లేదా అమ్ముకున్నా ఇతరుల అనుమతితో పనిలేకుండా ప్రక్రియ వేగంగా సాగుతుంది.
పారదర్శకత
ప్రతి ఫ్లోర్‌కు ప్రత్యేక బార్‌కోడ్ ఉండటం వల్ల రికార్డుల్లో అవకతవకలు జరగవు. బ్యాంక్ రుణాలు సులభంగా లభిస్తాయి. యజమాని తనకి చెందిన ఒక ఫ్లోర్ మీద మాత్రమే లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సేవల విభజన జరుగుతుంది. నీరు, విద్యుత్, మున్సిపల్ పన్నులు స్పష్టంగా విడిపోతాయి. విడివిడిగా విక్రయించే అవకాశం ఉండటం వల్ల ఆస్తికి లిక్విడిటీ పెరుగుతుంది.
ప్రభుత్వానికి, సమాజానికి లాభదాయకంగా ఉంటుంది. ప్రతి అంగుళం భూమి, ప్రతి అంతస్తు రికార్డుల్లోకి రావడం వల్ల ప్రభుత్వ ప్రాపర్టీ ట్యాక్స్ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అక్రమ కట్టడాలను నియంత్రించవచ్చు. జియో-ట్యాగింగ్ వల్ల అనుమతి లేని అదనపు అంతస్తులను సులభంగా గుర్తించవచ్చు. శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి.
- షేక్ కరీం-
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
